Friday, April 26, 2024
Friday, April 26, 2024

కాంగ్రెస్‌లో నవశకం

నూతన అధ్యక్షుడిగా ఖడ్గే బాధ్యతల స్వీకరణ

న్యూదిల్లీ: కాంగ్రెస్‌లో నవశకం మొదలైంది. దాదాపు 24ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌ కుటుంబయేతరుడిని పార్టీ పగ్గాలు వరించాయి. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్‌ నూతన అధ్యక్షుడిగా మల్లికార్జున ఖడ్గే ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం గర్వకారణమని, ఇది భావోద్వేగ క్షణమని, అత్యున్నత స్థాయికి చేర్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞుడనని అన్నారు. సాధారణ కార్మికుడి బిడ్డను కాంగ్రెస్‌ వారు అందలం ఎక్కించారన్నారు. కాంగ్రెస్‌ కోసం అహర్నిశలు పనిచేస్తానని, తన అనుభవంతో పార్టీని ముందుకు నడిపిస్తానని, కర్తవ్య నిర్వహణలో వెనకడగు వేయబోనని సంకల్పించారు. కాంగ్రెస్‌ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటానని చెప్పారు. అంతా కలిసి పార్టీని ఉన్నతస్థానానికి తీసుకెళదామని పార్టీశ్రేణులనుద్దేశించి అన్నారు. ‘మనం మహాత్మాగాంధీ సైనికులం. ఎవరికీ భయపడం. కాంగ్రెస్‌ కార్యకర్తలు తమ భయాన్ని జయిస్తే…అతిపెద్ద రాజ్యం కూడా శిరస్సు వంచుతుంది. రాహుల్‌గాంధీ అన్నట్లుగా ‘డరో మత్‌’ (భయపడొద్దు). ఇదే మన నినాదం’ అని కాంగ్రెస్‌ జెండాలతో ఘనంగా స్వాగతం పలికిన పార్టీ కార్యక్తలకు ఖడ్గే పిలుపునిచ్చారు. ‘ఇది పార్టీకి కష్టకాలమని తెలుసు. ప్రజాస్వామ్యాన్ని మార్చేందుకు ఏ స్థాయిలో కసరత్తు జరుగుతున్నదో అందరికీ తెలుసు. అబద్ధాలు`విద్వేషాల వ్యవస్థను కాంగ్రెస్‌ రూపుమాపగలదు’ అని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు. ‘ఇది ఎలాంటి నవభారతం. యువతకు ఉద్యోగాలు లేవు. జీపులతో రైతుల్ని తొక్కించేస్తున్నారు. మహిళలపై దురాగతాలు పేట్రేగిపోతున్నాయి. ధరల పెంపుతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఆకలికేకలు వినిపిస్తున్నాయి. విద్య ఖరీదుగా మారింది. కాలుష్యం పెరుగుతోంది. దళితులు, మైనారిటీలపై దురాగతాలకు అడ్డుఅదుపు లేదు. ప్రజలు దోపిడీకి గురవుతున్నారు. అవమానాలు ఎదుర్కొంటున్నారు. వారి నుంచి ప్రతి అవకాశం హరించబడుతోంది. నాథురామ్‌ గాడ్సేను దేశభక్తుడిగా...మహాత్మాగాంధీని మోసగాడిగా చూపే ప్రయత్నం జరుగుతోంది. బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రాజ్యాంగానికి మార్పులు చేస్తూ...దానిని సంఫ్‌ు రాజ్యాంగం (మనుస్మృతి)తో భర్తీ చేసే కుట్ర జరుగుతోంది. ఈడీ, సీబీఐ, ఐటీ శాఖలు 24 గంటలూ ప్రతిపక్షాలను అణచివేసేలా పనిచేస్తున్నాయి. ఇదేనా నవభారతం? కేంద్రప్రభుత్వం మొద్దునిద్రలో ఉంది. ప్రజల కష్టాలు పట్టడం లేదు. కేవలం క్రోనీ కేపటలిస్టు మిత్రులకు ఊడిగం చేస్తోంది’ అని ఖడ్గే విరుచుకుడ్డారు. నవభారతం కోసం కాంగ్రెస్‌ రహిత దేశాన్ని వారు (బీజేపీ) కోరుకుంటున్నారుగానీ అలా ఎప్పటికీ జరగనివ్వబోమని ఉద్ఘాటించారు. అవగాహనసాధికారత, సమాన అధికారాలు`భావాలతో నవభారతాన్ని నిర్మిద్దామని పిలుపునిచ్చారు. విద్వేషాన్ని రెచ్చగొట్టేవారిని, ప్రజల గొంతుకను అణచివేసేవారిని ఓడిద్దాం…ధరల పెంపు, నిరుద్యోగం, క్షుద్బాధను జయించి భారతదేశ భవిష్యత్‌ను కాపాడుకుందామని ఉద్ఘాటించారు. భారత్‌ జోడో యాత్రను కొనియాడారు. ఈ యాత్ర దేశంలో నూతనోత్సాహాన్ని నింపుతోందన్నారు. ఉదయ్‌పూర్‌ తీర్మానానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. 50 ఏళ్లలోపు వారికి సగానికిపైగా పార్టీ పదవులు ఇవ్వడం, ఖాళీలు భర్తీ చేయడం, ప్రజాప్రయోజనాల దృష్ట్యా శాఖల ఏర్పాటు, ఎన్నికల నిర్వహణ విభాగం ఏర్పాటు, రాష్ట్రాల్లో రాజకీయ వ్యవహారాల కమిటీల ఏర్పాటు వంటివన్నీ జరుగుతాయని ఖడ్గే నొక్కిచెప్పారు.
ప్రమాణస్వీకారానికి ముందు రాజ్‌ఘాట్‌ వద్ద మహాత్మాగాంధీకి ఖడ్గే నివాళులర్పించారు. జవహర్‌ లాల్‌ నెహ్రూ, లాల్‌బహుదూర్‌ శాస్త్రీ, ఇందిరాగాంధీ, జగ్జీవన్‌ రామ్‌ స్మారకాలను సందర్శించి అంజలి ఘటించారు. తొలుత తాను ఎన్నికైన పత్రాన్ని కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల యంత్రాంగానికి చైర్మన్‌గా ఉన్న మధుసూదన్‌ మిస్త్రీకి ఖడ్గే అందజేశారు. మిస్త్రీ మాట్లాడుతూ ఇతర పార్టీలు కాంగ్రెస్‌ నుంచి పాఠాలు నేర్చుకుంటాయని, అధ్యక్షుడి ఎన్నికను రహస్య బ్యాలెట్‌ ద్వారా నిర్వహిస్తాయని ఆకాంక్షించారు.
పూర్తిగా సహకరిస్తా: శశిథరూర్‌
మల్లికార్జున ఖడ్గేకు పార్టీ సీనియర్‌ నేత శశిథరూర్‌ శుభాకాంక్షలు తెలిపారు. తన వైపు నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని కొత్త కార్యాలయంలో కూర్చొన్న చరిత్రాత్మక సమయంలో ఖడ్గేతో చెప్పానని థరూర్‌ ట్వీట్‌ చేశారు. ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం అధినేత్రితో కలిసి ఖడ్గేతో పాటు కూర్చొని ఉన్న ఫొటోను పంచుకున్నారు. అధ్యక్ష పదవి కోసం ఖడ్గేతో శశిథరూర్‌ పోటీపడి ఓడిన విషయం విదితమే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img