Friday, April 26, 2024
Friday, April 26, 2024

కేరళ గవర్నర్‌ దుందుడుకు చర్యలు

. ప్రతిష్ఠ దెబ్బతీశారంటూ గగ్గోలు
. ఆర్థిక మంత్రి తొలగింపు ఒత్తిడి
. కుదరదన్న సీఎం విజయన్‌

తిరువనంతపురం: కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ వామపక్ష ప్రభుత్వంపై మరింత దూకుడుగా ప్రతీకార చర్యలకు పూనుకుంటున్నారు. ఆర్థిక మంత్రి కేఎన్‌ బాలగోపాల్‌ పదవీ ప్రమాణాన్ని ఉల్లంఘించారని ఆరోపిస్తూ…ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్‌ చేయడం ద్వారా వామపక్ష ప్రజాస్వామ్య కూటమి(ఎల్‌డీఎఫ్‌) ప్రభుత్వాన్ని చట్టపరమైన, రాజకీయ సంక్షోభంలోకి నెట్టేందుకు యత్నిస్తున్నారు. గవర్నర్‌ ఆరిఫ్‌ ఖాన్‌…ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు రాసిన లేఖలో ఆర్థిక మంత్రి ఐక్యతను దెబ్బతీసేలా ప్రసంగించారని ఆరోపించారు. మీ మంత్రివర్గ సహచరుడిపై రాజ్యాంగబద్ధంగా తగిన చర్యలు తీసుకోవాలని సీఎంను కోరారు. అయితే ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఆ డిమాండ్‌ను నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. మంత్రులను తొలగించడం లేదా నియమించడం తన రాజ్యాంగ హక్కు అని పునరుద్ఘాటించారు. బాలగోపాల్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ గవర్నర్‌ రాసిన లేఖను ముఖ్యమంత్రి తిరస్కరిస్తూ మంత్రిపై తనకున్న నమ్మకాన్ని పునరుద్ఘాటించారు. ఆర్థిక మంత్రిపై తనకు అచంచల విశ్వాసం ఉందని సీఎం విజయన్‌ స్పష్టంచేసినట్లు ప్రభుత్వ వర్గాలు పీటీఐకి తెలిపాయి. తన లేఖలో ఎల్‌డీఎఫ్‌ మంత్రివర్గం నుంచి బాలగోపాల్‌ను తొలగించాలని అర్థం వచ్చేలా సీఎంకు గవర్నర్‌ లేఖ రాశారు. రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రి సలహా ద్వారా గవర్నర్‌ అధికారం నియంత్రించబడిరదని ప్రభుత్వం భావిస్తోంది. రాజ్యాంగ దృక్పథం, దేశంలోని ప్రజాస్వామ్య సంప్రదాయాలను పరిగణనలోకి తీసుకుంటే గవర్నర్‌ అధికారాన్ని ఆస్వాదించడానికి ఈ ప్రకటన ఒక కారణం కాదని విజయన్‌ తన ప్రతిస్పందనలో పేర్కొన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ విషయంలో తదుపరి చర్యలు తీసుకోనవసరం లేదని విజయన్‌ చెప్పినట్లు వివరించాయి. విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో మంత్రి ప్రసంగిస్తూ ప్రాంతీయవాదంతో భారతదేశ ఐక్యతను దెబ్బతీశారని గవర్నర్‌ ఆరోపించారు. బాలగోపాల్‌ ప్రసంగం మంత్రిగా చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించడమేనని, అందువల్ల రాజ్యాంగబద్ధంగా తగిన చర్య తీసుకోవాలని విజయన్‌ను ఆదేశించారు. గవర్నర్‌కు సలహా ఇచ్చే హక్కు ముఖ్యమంత్రికి, మంత్రి మండలికి ఉందని, అయితే గవర్నర్‌ పదవి గౌరవాన్ని తగ్గించే వ్యక్తిగత మంత్రుల ప్రకటనలతో సహా చర్య తీసుకోవాల్సి ఉంటుందని అక్టోబరు 17న రాజ్‌భవన్‌ పీఆర్‌వో ట్వీట్‌ చేసిన తర్వాత గవర్నర్‌ చేసిన తొలి చర్య ఇదే. కేరళ విశ్వవిద్యాలయంలోని కార్యవట్టం క్యాంపస్‌లో బాలగోపాల్‌, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్‌.బిందు చేసిన వ్యాఖ్యలు ‘గవర్నర్‌ ప్రతిష్ఠను దిగజార్చడం, గవర్నర్‌ కార్యాలయం గౌరవాన్ని తగ్గించే లక్ష్యంతో స్పష్టంగా ఉన్నాయని గవర్నర్‌ ఆరోపించారు. ప్రాంతీయవాదం, ప్రాంతీయత అనే మంటలను రేకెత్తించేలా ఆర్థికమంత్రి చేసిన వ్యాఖ్యలు అత్యంత కలత కలిగించేవని, వాటిని అదుపు చేయకుండా అనుమతించినట్లయితే, అవి మన దేశ ఐక్యత, సమగ్రతపై హానికర ప్రభావం చూపుతాయని గవర్నర్‌ తన లేఖలో పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌ వంటి ప్రాంతాల నుంచి వచ్చిన వారికి కేరళలోని విశ్వవిద్యాలయాలను అర్థం చేసుకోవడం కష్టమని బాలగోపాల్‌ చెప్పినట్టు వార్తాపత్రిక కథనాలు వెలువడ్డాయి.
బాలగోపాల్‌ మాట్లాడుతూ ‘బనారస్‌ విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ సెక్యూరిటీ గార్డులు ఐదుగురు విద్యార్థులను కాల్చిచంపారు. అప్పుడు నేను ఎంపీగా ఉండి అక్కడికి వెళ్లాను. వైస్‌ ఛాన్సలర్‌కు 50 నుంచి 100 మంది సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. ఇది అక్కడ చాలా విశ్వవిద్యాలయాలలో పరిస్థితి’ అని తెలిపారు. ఆర్థిక మంత్రి వ్యాఖ్యలు కేరళ, దేశంలోని ఇతర రాష్ట్రాల మధ్య చీలికను సృష్టించడానికి, వివిధ రాష్ట్రాలు వేర్వేరు ఉన్నత విద్యా వ్యవస్థలను కలిగి ఉన్నాయనే తప్పుడు అభిప్రాయాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయి’ అని గవర్నర్‌ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి, రాజ్యాంగబద్ధంగా తగిన చర్యలు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్నత విద్య యూజీసీ నిబంధనలకు లోబడి ఉన్నందున, ఇది విశ్వవిద్యాలయాల వ్యవహారాలను నిర్వహించడానికి మార్గదర్శకాలు జారీ చేయడమే కాకుండా గణనీయమైన ద్రవ్య సహాయాన్ని అందిస్తున్నందున బాలగోపాల్‌ వాదనలకు ఎటువంటి ఆధారం లేదని ఖాన్‌ పేర్కొన్నారు. బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం ఒక కేంద్ర విశ్వవిద్యాలయమని, అది ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వ పాలనా నియంత్రణ కిందకు రాదని, యూపీ కంటే దక్షిణాదితో సహా ఇతర రాష్ట్రాలకు చెందిన వైస్‌ ఛాన్సలర్లు ఎక్కువగా ఉన్నట్లు బాలగోపాల్‌కు కూడా తెలియదని ఆయన అన్నారు.
ప్రభుత్వంపై కఠినవైఖరి
అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులపై సంతకం చేయకుండా కేరళ గవర్నర్‌ తన వైఖరిని కఠినతరం చేశారు. ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ కేరళ విశ్వవిద్యాలయ చట్టాల (సవరణ) బిల్లు, కేరళ లోకాయుక్త (సవరణ) బిల్లులపై సంతకం చేయడానికి నిరాకరించడం రాజ్‌భవన్‌, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధాలు చెడిన అంశాలలో ఒకటి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిత పౌరసత్వ సవరణ చట్టం, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కేరళ శాసనసభ ఆమోదించిన ఏకగ్రీవ తీర్మానాలను సవాలు చేయడం ద్వారా గవర్నర్‌ ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం ఆగ్రహాన్ని చవిచూశారు. తాజాగా విశ్వవిద్యాలయాల వైస్‌ ఛాన్సలర్‌ ఎంపిక ప్రక్రియ యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) నిబంధనలకు అనుగుణంగా లేదని సుప్రీంకోర్టు భావించినందున, 9 మంది వీసీల కొనసాగింపు అసాధ్యమని గవర్నర్‌ ఖాన్‌ స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ తాజా పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఏపీజే అబ్దుల్‌ కలాం టెక్నలాజికల్‌ విశ్వవిద్యాలయం (కేటీయూ) వైస్‌ ఛాన్సలర్‌గా ఎం.రాజశ్రీ నియామకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేయడం, అదే ప్రక్రియ ద్వారా ఎంపిక చేయబడిన ఇతర విశ్వవిద్యాలయ అధిపతులకు వర్తింపజేసిందని గవర్నర్‌ వాదించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img