Friday, April 26, 2024
Friday, April 26, 2024

కోవిడ్‌ మృతులపై విశ్వసనీయ డేటా అవసరం

మరణించిన కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం అందించాలి
కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ న్యూదిల్లీ : దేశంలో కోవిడ్‌19 మరణాలపై ప్రభుత్వం విశ్వసనీయమైన వివరాలు అందించాలని కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రాహుల్‌ గాంధీ బుధవారం డిమాండ్‌ చేశారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు ఒక్కొక్కరికి రూ.4 లక్షల పరిహారం చెల్లించాలని అన్నారు. గుజరాత్‌లో కోవిడ్‌తో తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు సంబంధించిన ఒక వీడియోను రాహుల్‌ షేర్‌ చేస్తూ, ప్రభుత్వం నుంచి వారికి సకాలంలో సహాయం అందలేదని ఆరోపించారు. దేశంలో అత్యుత్తమైనదిగా బీజేపీ అంచనా వేసిన ‘గుజరాత్‌ మోడల్‌’పై కూడా ఆయన విమర్శలు చేశారు. ‘కాంగ్రెస్‌ పార్టీ కోవిడ్‌ మరణాలపై విశ్వసనీయమైన వివరాలు ఇవ్వడంతోపాటు అలాగే కోవిడ్‌తో మరణించిన బాధిత కుటుంబాల ఒక్కొక్కటికి రూ.4 లక్షల నష్టపరిహారం అందించాలనే రెండు డిమాండ్‌లు చేస్తున్నది. ప్రభుత్వం ప్రజల బాధలను తగ్గించి వారికి పరిహారం అందించాలి’ అని హిందీలో ట్వీట్‌ చేశారు. ‘కాంగ్రెస్‌ పార్టీ న్యాయ ప్రచారం’కు చెందిన 4.31 నిమిషాల వీడియోలో రాహుల్‌ మాట్లాడుతూ గుజరాత్‌ మోడల్‌ గురించి బాగా మాట్లాడాతరని, కానీ కోవిడ్‌ సమయంలో తమకు ఆస్పత్రికిగానీ ఒక వెంటిలేటర్‌ సదుపాయంగానీ లభించలేదని ఆ బాధిత కుటుంబాల వారు ఆవేదన చెబుతున్నారని తెలిపారు. ‘మీరు ఆస్పత్రిలో వారికి సహాయం చేయవలసి వచ్చినప్పుడు మీరు అక్కడ లేరు. ఆస్పత్రిలో రూ.10 నుండి 15 లక్షలు వారు ఖర్చు చేసినప్పుడు, వారి కుటుంబ సభ్యులకు పరిహారం అందించడానికి ఇప్పటికీ మీరు అక్కడ లేరు. మీది ఎలాంటి ప్రభుత్వం’ అని ఆయన ప్రశ్నించారు. కోవిడ్‌తో 10 వేల మందే మరణించారని చెబుతుండగా, మూడు లక్షల మంది చనిపోయారన్నది నిజమని, ఈ మేరకు కాంగ్రెస్‌ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లారని అన్నారు. నేటి గుజరాత్‌ మోడల్‌లో కోవిడ్‌తో మరణించిన కుటుంబాలకు కేవలం రూ.50 వేల మాత్రమే పరిహారం చెల్లించారని రాహుల్‌ తెలిపారు. ‘కొత్త విమానం కొనడానికి ప్రధానికి రూ.8,500 కోట్లు ఉన్నాయి. కానీ కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు పరిహారం అందించడానికి ప్రభుత్వం డబ్బులు లేవు’ అని అన్నారు. దేశంలో కోవిడ్‌తో మరణించిన లక్షల మందికి ప్రభుత్వం రూ.4 లక్షల పరిహారం చెల్లించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ‘కొంతమంది ఎంపిక చేసిన పారిశ్రామిక వేత్తలకు దేశాన్ని అప్పగిస్తున్నారు. కోవిడ్‌ సమయంలో లక్షల రూపాయల పన్ను ఉపశమనం ఇచ్చారు. కానీ దేశంలో కోవిడ్‌తో మరణించిన పేద ప్రజలకు పరిహారం మాత్రం చెల్లించడం లేదు’ అని కాంగ్రెస్‌ నేత ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి బాధిత కుటుంబాల ఒక్కొక్కరికి రూ.4 లక్షల పరిహారం అందేలా చూస్తామని రాహుల్‌ ఆ వీడియోలో తెలిపారు. కాగా వచ్చే ఏడాది చివరిలో ఎన్నికలు జరగనున్న గుజరాత్‌లో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ తన ప్రచారాన్ని ముమ్మరం చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img