Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

పీఎస్‌ఎల్వీ`52 ప్రయోగం విజయవంతం

మూడు ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపిన ఇస్రో
భూపరిశీలన కోసం ఆర్‌ఐశాట్‌ ఉపగ్రహం

విశాలాంధ్ర బ్యూరో` నెల్లూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సి52 ద్వారా నింగిలోకి మూడు ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష ప్రయోగం కేంద్రం నుంచి సోమవారం ఉదయం చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతమయ్యింది. మొత్తంగా 25.30 గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం ఉదయం 5.59 గంటలకు వాహకనౌక ఆర్‌ఐశాట్‌-1, ఐఎన్‌ఎస్‌-2టీడీ, ఇన్‌స్పైర్‌శాట్‌-1 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లింది. ప్రయోగ కేంద్రం నుంచి బయలు దేరిన 18.31 నిమిషాల తర్వాత ఈ మూడు ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి రాకెట్‌ ప్రవేశపెట్టినట్టు ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ సోమనాథ్‌ ప్రకటించారు. శాస్త్రవేత్తల కృషి ఫలించిందని, వారికి ఆయన అభినందనలు తెలిపారు. ఈ ఏడాదిలో ఇస్రో చేపట్టిన మొదటి ప్రయోగం ఇదే కాగా… ఇస్రో అధిపతిగా ఇటీవల నియామకమైన డాక్టర్‌ సోమనాథ్‌ ఆధ్వర్యాన చేపట్టిన తొలి ప్రయోగం కావడం విశేషం. ఇస్రో ప్రయోగించిన మూడు ఉపగ్రహాల్లో ఆర్‌ఐశాట్‌-1 అతిపెద్దది. మొత్తం 1,710 కిలోల బరువుండే ఈ ఉపగ్రహం కాల పరిమితి పదేళ్లు. ఈ ఉపగ్రహం ద్వారా ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. రేయింబవళ్లు అన్ని వాతావరణ పరిస్థితుల్లో పనిచేసేలా దీనిని రూపొందించారు. ఉపగ్రహంలో అధిక డేటా నిర్వహణ వ్యవస్థలు, అధిక నిల్వ పరికరాలు ఉన్నాయి. వ్యవసాయం, అటవీ, నీటి వనరుల నిర్వహణ కోసం విలువైన సమాచారం సేకరించడానికి ఈ ఉపగ్రహం ఇమేజింగ్‌ డేటా ఉపయోగపడనుంది.
రెండోది ఐఎన్‌ఎస్‌-2టీడీ ఉపగ్రహాన్ని భారత్‌, భూటాన్‌ శాస్త్రవేత్తలు సంయుక్తంగా రూపొందించారు. 17.5 కిలోల బరువుండే ఈ ఉపగ్రహ జీవితకాలం ఆరు నెలలు. భవిష్యత్తులో సైన్సు, ప్రయోగాత్మక పేలోడ్స్‌ కోసం రూపొందించారు. విశ్వవిద్యాలయాల విద్యార్థులు తయారుచేసిన ఇన్‌స్పైర్‌శాట్‌-1 ఉపగ్రహం బరువు 8.1 కిలోలు. ఏడాది జీవితకాలం ఉండే ఈ ఉపగ్రహాన్ని తక్కువ భూకక్ష్యలో ఉంచారు. భూమి అయానోస్పియర్‌ అధ్యయనం నిమిత్తం కాంపాక్ట్‌ అయానోస్పియర్‌ ప్రోబ్‌ అమర్చి ఉంటుంది. ఈ ఉపగ్రహాన్ని యూఎస్‌లోని కొలరాడో బౌల్డర్‌ యూనివర్సిటీలోని ల్యాబరేటరీ ఫర్‌ అట్మాస్ఫియరిక్‌ అండ్‌ స్పేస్‌ ఫిజిక్స్‌, నేషనల్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ, తైవాన్‌, సింగపూర్‌లోని నాన్యాంగ్‌ టెక్నాలజికల్‌ విశ్వవిద్యాలయం, తిరువనంతపురంలోని ఐఐఎస్‌టీ సహకారంతో రూపకల్పన చేశారు. పీఎస్‌ఎల్వీ-52 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైందని ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ సోమనాథ్‌ తెలిపారు. దీంతో శాస్త్రవేత్తల కృషి ఫలించిందన్నారు. ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు.
అత్యంత అధునాతన చిత్రాలను అందించడానికి రూపొందించి నటువంటి రాడార్‌ ఇమేజింగ్‌ ఉపగ్రహంలో ఏర్పాటు చేసినట్లు ఇస్రో చైర్మన్‌ వెల్లడిరచారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో చంద్రయాన్‌ మిషన్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు ఆయన తెలిపారు.
ప్రధాని, సీఎం అభినందన
తొలి ప్రయోగం విజయవంతం కావడంపై భారత ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిలతో పాటు అనేకమంది ప్రముఖులు ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ను అభినందించారు.
కక్ష్యలోకి దూసుకెళ్లిన ఉపగ్రహాలివే..
బ వ్యవసాయం, అటవీ, నీటి వనరుల సమాచారం కోసం ఆర్‌ఐశాట్‌-1 ఉపగ్రహం
బ భారత్‌, భూటాన్‌ సంయుక్తంగా రూపొందించిన ఉపగ్రహం ఐఎన్‌ఎస్‌-2టీడీ
బ భవిష్యత్తు సైన్సు, ప్రయోగాత్మక పేలోడ్స్‌ కోసం ఐఎన్‌ఎస్‌-2టీడీ ఉపగ్రహం
బ భూమి అయానోస్పియర్‌ అధ్యయనం కోసం ఇన్‌స్పైర్‌ శాట్‌-1 ఉపగ్రహం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img