Friday, April 26, 2024
Friday, April 26, 2024

పోలవరం ఎత్తుపై మోదీ సర్కారు పిల్లిమొగ్గలు

. నిన్న 41.15 మీటర్లకే పరిమితమని వెల్లడి
. నేడు 45.72 మీటర్లు అంటూ డ్రామాలు
. పార్లమెంటు సాక్షిగా భిన్న ప్రకటనలు

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై కేంద్ర ప్రభుత్వం డ్రామాలాడుతోంది. రోజుకో ప్రకటన చేస్తూ రాష్ట్ర ప్రజలను అయోమయానికి గురిచేస్తోంది. పార్లమెంటు సాక్షిగా భిన్న ప్రకటనలు చేస్తూ ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది. బాధ్యతా రహితంగా వ్యవహరిస్తోంది. అమరావతి రాజధాని విషయంలోనూ ఇలాగే కేంద్రం భిన్న ప్రకటనలు చేసింది. అదే తరహాలో పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై ఈనెల 23న 41.15 మీటర్ల వరకే నీటి నిల్వను పరిమితం చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. తాజాగా సోమవారం మాట మార్చింది. పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వ 45.72 మీటర్లని చెప్పు కొచ్చింది. పోలవరం పురోగతిపై రాజ్యసభలో ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి విశ్వేశ్వర్‌ తుడు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. 1980 నాటి గోదావరి ట్రిబ్యునల్‌ అవార్డు ప్రకారం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం ఎత్తు 45.72 మీటర్లు అని, నీటి నిల్వ సామర్ధ్యం 41.15కి తగ్గించాలంటూ ఏపీ ప్రతిపాదించినట్టు తమకు సమాచారం లేదని తెలిపారు. ఈ నెల 23వ తేదీన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ డాక్టర్‌ సత్యవతి అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి సహాయ మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ సమాధానమిస్తూ పోలవరం మొదటి దశలో 41.15 మీటర్ల వరకు నీరు నిల్వ చేస్తామని తెలిపారు. అదేరోజు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి కూడా అసెంబ్లీలో తొలిదశలో 41.15 మీటర్లకే నీటి నిల్వను పరిమితం చేస్తున్నట్లు చెప్పారు. రాజ్యసభలో తాజాగా 45.72 మీటర్ల మేరకు నీటి నిల్వ చేయనున్నట్లు మరో మంత్రి తుడు ప్రకటించారు. సవరించిన అంచనాలను కేంద్రం చెల్లిస్తుందా అని అడిగిన మరో ప్రశ్నకు ఈ అంచనాలకు సంబంధించి ఒకే కమిటీ రెండు సిఫార్సులు చేసిందని తెలిపారు. 201718 ధరల మేరకు సవరించిన అంచనా వ్యయం రూ.47,725 కోట్లుగా ఉందన్న కేంద్ర ప్రభుత్వం... 2019లో తమకు వచ్చిన సవరించిన అంచనా వ్యయం రూ.55,548 కోట్లు అని పేర్కొంది. ఈ అంచనాలను జలశక్తి శాఖ సాంకేతిక సలహా కమిటీ అంగీకరించిందని చెప్పింది. ఆర్‌సీసీ అధ్యయనంలో అంచనా వ్యయం రూ.47,725 కోట్లుగా నిర్ధారణ అయిందని వెల్లడిరచింది. 201314 ప్రకారం అంచనా వ్యయం రూ.29,027 కోట్లుగా పేర్కొన్న కేంద్రం… భూసేకరణ, పరిహారం, పునరావాస ఖర్చు వల్లే ప్రాజెక్టు అంచనా వ్యయం పెరిగిందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు చేసిన ఖర్చులో రూ.13,463 కోట్లు చెల్లించామని వివరించింది. అయితే ప్రాజెక్టు ఎత్తుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రోజుకో విధంగా చేస్తున్న ప్రకటనలను గమనిస్తుంటే ఈ ప్రాజెక్టు విషయాన్ని పూర్తిగా రాజకీయం చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే పూర్తి కావలసిన ప్రాజెక్టు రకరకాల కారణాలతో నత్తనడకన సాగుతోంది. ఇంత వరకూ ప్రధాన ప్రాజెక్టు ఎర్త్‌కమ్‌ రాక్‌ఫిల్‌డ్యామ్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) డిజైన్లు సిద్ధం కాలేదు. అప్రోచ్‌ చానల్‌ పనులు ఇంకా 36.54 శాతం మిగిలి ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టు నిర్మాణ పనులు, పునరావాస ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే లోక్‌సభ సాక్షిగా చెప్పడం గమనార్హం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img