Friday, April 26, 2024
Friday, April 26, 2024

ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి కానుక

. పండుగ రోజు ఒక డీఏ
. నెలాఖరులోగా మిగిలిన సమస్యలు పరిష్కారం
. ఏపీ ఎన్జీవో డైరీ ఆవిష్కరణలో జగన్‌ హామీ

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : ప్రభుత్వ ఉద్యోగులకు ఎట్టకేలకు కరువు భత్యంపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి నుంచి స్పష్టమైన హామీ లభించింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఒక డీఏ చెల్లిస్తామని, జనవరి నెలాఖరులోపే మిగిలిన సమస్యల పరిష్కారానికి కూడా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. దీంతో ఉద్యోగ సంఘ నేతలు హర్షం వ్యక్తం చేశారు. కొంత ఆలస్యమైనప్పటికీ ప్రతి సంవత్సరం సంప్రదాయంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసేందుకు ముఖ్యమంత్రి నుంచి ఎన్జీవో అసోసియేషన్‌ నేతలకు బుధవారం అనుమతి లభించింది. దీంతో ఏపీ జేఏసీి చైర్మన్‌ బండి శ్రీనివాసరావు, సెక్రెటరి జనరల్‌ జి.హృదj రాజు అధ్వర్యంలో సభ్య సంఘాల నేతలు సీఎంను కలిశారు. ఇదే అదునుగా తొలుత ఏపీ ఎన్జీవో అసోసియేషన్‌తో పాటు సభ్య సంఘాలకు చెందిన నూతన డైరీ, క్యాలెండర్‌లను సీఎంచే ఆవిష్కరణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నారు. అనంతరం రాష్ట్రంలో ఉన్న 13 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన ఉమ్మడి డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకొచ్చారు.
సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని, సీపీఎస్‌ ఉద్యోగుల డీఏ, మ్యాచింగ్‌ గ్రాంట్‌ చెల్లింపులు చేయాలని, ప్రతి నెలా ఒకటో తేదీన జీతం, పెన్షన్లు మంజూరు చేయాలని, 12వ పీఆర్సీపై కమిషన్‌ వేయాలని, 11వ పీఆర్సీ అసమానతలు తొలగించుటకు అనామలిస్‌ కమిటీ వేయాలని, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు, గిరిజన, మోడల్‌ స్కూల్‌, మున్సిపల్‌ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని, కేజీబీవీ టీచర్లకు మినిమం టైమ్‌ స్కేల్‌ ఇవ్వాలని, పంచాయతీరాజ్‌, అగ్రికల్చరల్‌ శాఖ డిమాండ్లు, ఉద్యోగులకు ఫేస్‌ యాప్‌ సమస్యలు పరిష్కరించాలని, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని తదితర సమస్యలను ముఖ్యమంత్రికి వివరించారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందిస్తూ సంక్రాంతి పండుగ సందర్భంగా ఒక డీఏ ప్రకటిస్తామని, బకాయిపడ్డ ఏపీజీఎల్‌ఐ, పీఎఫ్‌, డీఏ లోన్స్‌, క్లైయిమ్స్‌లో కొంతమేర జనవరి ఆఖరులోపు చెల్లిస్తామని హామీ ఇచ్చారు.
అలాగే 60 నుంచి 62 సంవత్సరాలు పదవీ విరమణ పెంచిన ప్రభుత్వ విద్యాసంస్థల ఉపాధ్యాయులకు త్వరలోనే ఉత్తర్వులు ఇస్తామని తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో చైర్మన్‌ బండి శ్రీనివాసరావు, సెక్రెటరీ జనరల్‌ జి.హృదయ రాజు, కో చైర్మన్లు హెచ్‌.తిమ్మన్న, కె.ఎస్‌.ఎస్‌.ప్రసాద్‌, సీతారామరాజు, డిప్యూటీ సెక్రెటరీ జనరల్‌ కె.వి.శివారెడ్డి, వైస్‌ చైర్మన్‌లు బండి శ్రీనివాస్‌, శోభన్‌ బాబు, వేణు మాధవ్‌, జాని బాషా, పెన్షనర్ల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వర్లు, స్వామిదాస్‌, కోశాధికారి రంగారావు, కార్యవర్గ సభ్యులు రమణ, వివిధ సభ్య సంఘాల నాయకులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img