Friday, April 26, 2024
Friday, April 26, 2024

మోదీ పెద్ద అహంకారి

రైతులు నాకోసం చచ్చారా అన్నారు
వారిపై కేసులు వెనక్కి తీసుకోవాల్సిందే
మాట తప్పితే రైతు ఆగ్రహం చవి చూడాల్సిందే
మేఘాలయ గవర్నరు మాలిక్‌ సంచలన వ్యాఖ్యలు

న్యూదిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ ఓ పొగరుబోతని మేఘాలయ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ మండిపడ్డారు. రైతు సమస్యలపై చర్చించేందుకు మోదీతో భేటీ అయిన సమయంలో దురహంకారంతో వ్యవహరించారని, అందుకే ఐదు నిమిషాల్లో సమావేశాన్ని ముగించినట్లు తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సైతం ప్రధానికి మతిపోయిందని, పిచ్చివాడని అన్నారన్నారు. ప్రధాని మోదీ ఓ దురహంకారి అని మాలిక్‌ విమర్శలు చేశారు. ‘రైతు సమస్యలపై చర్చించేందుకు మోదీతో భేటీ అయ్యాను. 500 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని చెప్పగానే.. కోపంతో ఊగిపోయిన మోదీ.. నా కోసమేమన్నా చనిపోయారా?’ అంటూ ప్రశ్నించారని అన్నారు. దానికి ‘అవును… నువ్వు ఈ దేశానికి ప్రధాని అయిన నాటి నుండే ఇలా జరుగుతోంది’ అని సమాధానమిచ్చానని తెలిపారు. వెంటనే మోడీ.. అమిత్‌షాను కలవమని అన్నారని, తాను ఆయన్ను కలిశానని అన్నారు. కుక్క చనిపోతేనే సంతాపం తెలిపే మోదీ.. ఇంతమంది రైతులు చనిపోతే.. పట్టనట్లు వ్యవహరించారని విమర్శించారు. మాలిక్‌ హరియాణాలోని దాద్రిలో మాట్లాడుతూ అనేక అంశాలను ప్రస్తావించారు. ఆందోళనల సమయంలో రైతులపై బనాయించిన కేసుల అంశాన్ని ప్రధాని వద్ద ప్రస్తావించానని మాలిక్‌ తెలిపారు. మోదీ సర్కారు కేసులన్నీ వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్‌ చేశారు. రైతులపై బనాయించిన కేసులన్నీ ప్రభుత్వం నిజాయతీతో ఎత్తివేయాల్సిందే. అదే సమయంలో కనీస మద్దతుధర(ఎంఎస్‌పీ)కి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఇది ప్రభుత్వ బాధ్యతని పేర్కొన్నారు. ఒకవేళ రైతులు ఆందోళన విరమించారని ప్రభుత్వం భావిస్తే అది మూర్ఖత్వమే అవుతుందన్నారు. ఆందోళనను రైతులు కేవలం తాత్కాలికంగానే వాయిదా వేశారని గుర్తు చేశారు. తమకు న్యాయం జరగలేదని భావించినా…తమతో సక్రమంగా నడుచుకోవడం లేదని అనుమానం వచ్చినా రైతులు తిరిగి ఉద్యమం ప్రారంభిస్తారని మాలిక్‌ హెచ్చరించారు. ఇటీవల కాలంలో మోదీ సర్కారుపై మాలిక్‌ ప్రత్యేకించి రైతు ఆందోళనలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. గవర్నరు పదవిని వదులుకోవడానికైనా తాను సిద్ధమేనని తెగేసి చెప్పారు. మోదీ వ్యక్తిగత ప్రతిష్ఠ కోసం ప్రారంభించిన సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టుపైనా మాలిక్‌ ఇటీవల కాలంలో ఆరోపణలు గుప్పించారు. కొత్త పార్లమెంటు భవనం నిర్మించడానికి బదులు ప్రపంచస్థాయి కాలేజీ నిర్మాణం చేపట్టడం ఉత్తమమని హితవు పలికారు. మోదీ ప్రధాని బాధ్యతలు చేపట్టిన తర్వాత మాలిక్‌ను జమ్ముకశ్మీరుగా నియమించారు. ఆ తర్వాత గోవాకు, ఇప్పుడు మేఘాలయకు బదిలీ చేశారు.
మాలిక్‌ చెప్పింది నిజమేనా : కాంగ్రెస్‌
ప్రధాని మోదీని పెద్ద అహంకారిగా మేఘాలయ గవర్నరు మాలిక్‌ వ్యాఖ్యానించడంపై కాంగ్రెస్‌ స్పందించింది. మాలిక్‌ వ్యాఖ్యలు నిజమేనా అని ప్రశ్నించింది. మాలిక్‌ వ్యాఖ్యల వీడియో క్లిప్‌ను ట్విట్టర్‌లో షేర్‌ చేసింది. రైతుల సమస్యపై ప్రధాని పెద్ద అహంకారంతో ఉన్నారని సత్యపాల్‌ మాలిక్‌ బహిరంగంగా చెప్పారని, అంతేకాకుండా దీనిపై అమిత్‌షాతో చెప్పుకోండని ప్రధాని చెప్పినట్లు మాలిక్‌ అన్నారని కాంగ్రెస్‌ నేత మల్లికార్జునఖర్గె గుర్తుచేశారు. ప్రధాని మోదీని అమిత్‌ షా పిచ్చివాడని వ్యాఖ్యానించినట్లు మాలిక్‌ చెబుతున్నారని తెలిపారు. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న నేతలు ఇలాంటి పిచ్చిమాటలు మాట్లాడుకోవచ్చా అని ఖర్గె నిలదీశారు. నరేంద్రమోదీగారూ…ఇది నిజమేనా? అని ఖర్గె ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img