. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుపై ప్రత్యేక కార్యక్రమం
. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
విశాలాంధ్ర-హైదరాబాద్: రాష్ట్రంలో పేదల సొంత ఇంటి కలను సాకారం చేయడానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొలిక్కి వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి సూచన మేరకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2వ తేదీన ఆదిలాబాద్ జిల్లాలో రెండో విడతను లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలపై ఈ నెల 21 న జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రెవెన్యూ, హౌసింగ్ అంశాలపై జిల్లాల వారీగా ప్రజా ప్రతినిధులతో నిర్వహిస్తున్న సమావేశాల్లో భాగంగా మంగళవారం హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన ఇంఛార్జ్ మంత్రులు, జిల్లా మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు, హౌసింగ్, రెవెన్యూ, అటవీ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ పేదలు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు 5 నుంచి 8 కిలోమీటర్ల పరిధిలోనే ఇందిరమ్మ ఇళ్లను నిర్మించే విధంగా నియోజకవర్గాన్ని యÖనిట్గా తీసుకుని స్థలాలను గుర్తించి తగిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఏ నియోజకవర్గానికి సంబంధించి ఆ నియోజకవర్గంలోనే ప్రభుత్వ స్థలాలు, మురికివాడలు, భూదాన్, గతంలో వివిధ పథకాల కింద నిర్మించిన ఇళ్లు శిధిలావస్థలో ఉన్న ప్రాంతాలను గుర్తించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని భాగస్వాములను చేయాలని అధికారులను ఆదేశించారు. 2 బీహెచ్కే ఇళ్లను లబ్ధిదారులను కేటాయించడానికి యుద్ధప్రాతిపదికన ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ పరిధిలో ఇళ్ల స్థలాలు ఉన్న అర్హులయిన లబ్ధిదారులకు ఈ నెల చివరిలోగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేయా లని అధికారులను ఆదేశించారు. అంగుళం ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైనా కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి పొంగులేటి హెచ్చరించారు. శాశ్వత భవనాలు లేని ఆర్డీవో, తహశీల్దార్, సబ్ రిజస్ట్రార్ కార్యాలయాలకు సొంత భవనాలను నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి, రంగారెడ్డి జిల్లా ఇంఛార్జ్ మంత్రి డి.శ్రీధర్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కార్యక్రమాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం ముఖ్యమైనదని అన్నారు. శాసనసభ స్పీకర్ జి.ప్రసాద కుమార్ మాట్లాడుతూ శాసన సభలో తీసుకున్న నిర్ణయం మేరకు సమావేశాలు నిర్వహించడం పట్ల మంత్రికి అభినందనలు తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్, హౌసింగ్ ఎండీలు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఒక రూట్ మ్యాప్ తయారు చేయాలని ఆదేశించారు.


