Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

నిప్పుల కుంపటి

రోహిణీకి ముందే భానుడి ఉగ్రరూపం

. 45 నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు
. 153 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు
. మండే ఎండలకు జనం బేజారు
. విజయవాడలో సెల్‌ టవర్‌ దగ్ధం

విశాలాంధ్ర బ్యూరో -అమరావతి: రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారింది. అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తారస్థాయికి చేరాయి. ఎండలకు వడగాడ్పులు తోడు కావడంతో జనం బేజారెత్తుతున్నారు. ఉదయం 7 గంటల నుంచే వడగాడ్పులు మొదలవుతుండగా, రాత్రి 9 గంటలకు కూడా వేడి తగ్గడం లేదు. దీంతో ప్రజలు పగలు బయటకు రావడానికి భయపడుతున్నారు. మధ్యాహ్న సమయంలో వీధులన్నీ కర్ఫ్యూని తలపించాయి. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సాధారణం కంటే 4 నుంచి 6 డిగ్రీల మేర అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయినట్లు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడిరచింది. వాయవ్య భారత్‌ నుంచి వీస్తున్న వేడి గాలుల కారణంగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతల తీవ్రత ఒక్కసారిగా పెరిగినట్లు భారత వాతావరణ విభాగం వెల్లడిరచింది. అత్యధిక ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు పైగా దాటింది. ప్రకాశం జిల్లా తర్లుపాడు, విజయవాడ, నందిగామ, కంచికచర్ల, గుంటూరు నగరాల్లో 47 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే అనకాలపల్లి జిల్లాలోని గొలుగొండ, కొటారట్ల, మాకవారిపాలెం, నర్సీపట్నం మండలాల్లో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. బాపట్ల జిల్లాలోని చెరుకుపల్లె, అమృతలూరు, పిట్టలవానిపాలెం, కోనసీమలో మండపేట, కపిలేశ్వరపురం, కొత్త పేట, రాయవరం, కృష్ణాలో అవనిగడ్డ, చల్లపల్లి, గన్నవరం, గుడివాడ, గుడ్లవల్లేరు, కంకిపాడు, ఘంటశాల, పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లి గూడెం, పోడూరు, తణుకు, ఉండి, వీరవాసరం తదితర మండలాల్లో 46 నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 153 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీచాయి. విజయవాడ నగరంలోని కృష్ణలంక బాలాజీనగర్‌లో భానుడి ప్రతాపానికి సెల్‌ టవర్‌ దగ్ధమైంది. ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంకు బిల్డింగ్‌పై సెల్‌ టవర్లను ఏర్పాటు చేశారు. నగరంలో 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయిన నేపథ్యంలో మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో సెల్‌ టవర్‌లో మంటలు చెలరేగాయి. దీంతో వైర్లు, బ్యాటరీలు, ఇతర పరికరాలు పూర్తిగా తగలపడిపోయాయి. సమాచారం అందిన వెంటనే కృష్ణలంక పోలీసులు అక్కడకు చేరుకుని బిల్డింగ్‌ చుట్టుపక్కల వారిని బయటకు పంపించి వేశారు. హుటాహుటిన విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. డిప్యూటీ మేయర్‌ బెల్లం దుర్గ ఘటనా స్థలానికి చేరుకుని అధికారులు, ప్రజలతో మాట్లాడారు. ఎండ వేడిమి వల్లే షార్ట్‌ సర్క్యూట్‌ అయినట్లు భావిస్తున్నామని, అయితే ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని ఘటనా స్థలానికి వెంటనే చేరుకున్న సీఐ దుర్గారావు వెల్లడిరచారు. రోహిణీ కార్తె రాకముందే ఇంత తీవ్రస్థాయిలో ఎండలుంటే, ఇక రోహిణీ ప్రారంభమైన తర్వాత ఎలా ఉంటాయోనని ప్రజలు భయపడుతున్నారు. మరో రెండు రోజులు ఎండల తీవ్రత ఇలాగే ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, పిల్లలు బయటకు రావల్సిన పరిస్థితులు ఏర్పడితే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img